నటరాజన్.. మరోసారి జాక్‌పాట్ !

నక్కతోక తొక్కడం అంటే.. ఇదేనేమో !. నెట్‌ బౌలర్‌గా వచ్చిన టి. నటరాజన్ టీ20, వన్డేల్లోకి తెరంగేట్రం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యువ పేసర్ మరో జాక్ పాట్ కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. గాయపడటంతో స్వదేశానికి వెనుదిరిగిన ఉమేశ్‌యాదవ్‌ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు.

బుధవారమే జట్టులో చేరిన రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చెతేశ్వర్‌ పుజారా నుంచి బాధ్యతలు తీసుకున్నాడు. ‘మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మూడోరోజు ఉమేశ్‌ యాదవ్‌ ఎడమకాలి పిక్క కండరాలకు గాయమైంది. మిగతా రెండు టెస్టుల్లోపు అతడు కోలుకొనే అవకాశాల్లేవు. దాంతో మిగిలిన టెస్టు సిరీసుకు దూరం అవుతున్నాడు. అతడి స్థానంలో టి.నటరాజన్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. బాక్సింగ్‌ డే టెస్టుకు ముందే షమి బదులు శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులో చేరాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా మీడియాకు తెలిపారు.