రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. అంతేకాదు.. తన రాజీనామాను సభాపతి వెంటనే ఆమోదించినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
అంతకుముందు గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ‘తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించా. దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నా. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం అరాచక పాలన కొనసాగిస్తోంది. నేను రాజీనామా అంటే కేసీఆర్ దిగొస్తున్నారు. నా రాజీనామాతో జరిగే ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తారు’ అని చెప్పుకొచ్చారు.
