సీఎం కేసీఆర్‌ పంద్రాగస్టు కానుక.. 57ఏళ్లు నిండిన వారికి పింఛన్లు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. పంద్రాగస్టు కానుక ప్రకటించారు. రెండోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితులు, ఆ తర్వాత కేంద్రం నుంచి సరైన సహకారం అందని నేపథ్యంలో వీటి అమలు ఆలస్యం అయింది. అయితే రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం విధానాలు ఎంగడుతూనే.. రాష్ట్ర ప్రజలకు కొన్ని తీపి కబుర్లు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల పింఛన్లు ఉన్నాయని, స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కొత్తగా మరో 10లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అంతేకాదు.. సత్ప్రవర్తన  కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని జైళ్ల శాఖను ఆదేశించినట్టు సీఎం తెలిపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ  డయాలసిస్‌ చేయించుకునే రోగులకు కూడా పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక పాలమీద జీఎస్టీ రద్దు చేయాలని ఈ సందర్బంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.