వైకాపా గెలవదు.. గెలవనివ్వం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవట్లేదు. గెలవనివ్వం. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని గతంలో ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. బీజేపీ, టీడీపీ లకు  అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు. వైకాపా నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమిషన్లు కొట్టే రకం కాదు. వైకాపా ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చి పోరాడుతున్నా. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని చెప్పుకొచ్చారు.

“నన్ను వారాంతపు పొలిటీషయన్‌ అంటున్నారు. కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. నేనెలా తిరుగుతానో చూస్తామని వైకాపా గాడిదలు ఓండ్ర పెడుతున్నాయి. వారానికి ఒక్కరోజు వస్తేనే వైకాపా వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నాకు తాతలు సంపాదించి పెట్టిన రూ.వేల కోట్లు లేవు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు నా దగ్గర లేదు. నా కష్టార్జితంతో రైతులకు సాయం చేస్తున్నాను” అని అన్నారు.