టీఆర్ఎస్ లోకి తీన్మార్ మల్లన్న !

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం నమోదు కానుందా ? ప్రతిపక్షాలను మించి సీఎం కేసీఆర్, గులాబీ పార్టీని విమర్శించే జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కొరకరాని కొయ్యగా మారిన మల్లన్న టీఆర్ఎస్ చేరడం అంటే ఓ సంచలనమే. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదుగా ? అది జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినది కాదా అని డౌటుఅనుమానాలు కలగవచ్చు. మీ క్వశ్చన్ నిజమే. అయితే మల్లన్న టీఆర్ఎస్ లో గానీ బీఆర్ఎస్ లో గానీ చేరడం లేదు. ఆయనే టీఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారమ్. అదెట్ల సాధ్యం అంటే.. ?

ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. అది బీఆర్ ఎస్ గా పేరు మార్చుకుంది. ఇప్పుడు టీఆర్ ఎస్ తో బీఆర్ ఎస్ కు టెక్నికల్ గా ఎలాంటి సంబంధం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఓ ముగ్గురు కీలక నేతలు కొత్త పార్టీని  ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు. ఆ పార్టీ పేరు ‘తెలంగాణ రాజ్యసమితి’ (టీఆర్ఎస్) గా పెట్టబోతున్నారు. పార్టీ గుర్తు.. కూడా టీఆర్ ఎస్ ను పోలి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తూ.. ఈ పార్టీని తీసుకొస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ప్రయత్నంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. మరీ.. మిగిలిన ఇద్దరు నేతలు ఎవరు ? అంటే.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల కూడా  ఉండొచ్చు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పడే ఓట్లకు గండికొట్టడం.. మరో దఫా ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యాంగా కొత్త టీఆర్ ఎస్ పార్టీ పురుడు పోసుకోబోతున్నట్లు తెలుస్తోంది.