రివ్యూ : ఒకే ఒక జీవితం

చిత్రం : ఒకే ఒక జీవితం

నటీనటులు : శర్వానంద్‌, అమల, రీతూవర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు

దర్శకత్వం : శ్రీ కార్తిక్‌

నిర్మాత : ప్రకాశ్‌బాబు

రిలీజ్ డేట్ : 09 సెప్టెంబర్, 2022

భార‌తీయ తెర‌పై ఆవిష్కృత‌మైన మరో టైమ్ ట్రావెల్‌ క‌థే.. ‘ఒకే ఒక జీవితం’. శ‌ర్వానంద్‌, అమ‌ల న‌టించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరీ.. సినిమా కూడా ఆ స్థాయిలో ఉందా ? లేదా ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ క‌లిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. ఎవ‌రిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. అతడు ఇర‌వ‌య్యేళ్లుగా టైమ్ మెషిన్‌ క‌నిపెట్టడం కోసం కష్టప‌డుతుంటాడు. చివ‌రికి తాను క‌నిపెట్టిన టైమ్ మెషిన్‌తో గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. మ‌రి వాళ్లు గ‌తంలోకి వెళ్లి ఏం చేశారు? త‌ప్పుల్ని స‌రిదిద్దుకున్నారా ? భ‌విష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పింద‌నేది మిగ‌తా క‌థ‌.

నటీనటుల పర్ ఫామెన్స్ :

టైమ్ మిషన్ కథాంశంతో కూడిన క‌థే అయినా ‘ఒకే ఒక జీవితం’ గ‌తంలో వ‌చ్చిన సినిమాల‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మ ప్రేమ‌తో ముడిపెట్టి ఈ క‌థ‌ని అల్లాడు ద‌ర్శకుడు. భావోద్వేగాల‌తో కూడిన ఈ నేప‌థ్యంలో క‌థ రాసుకోవడంలోనే ద‌ర్శకుడు స‌గం విజ‌యం సాధించాడు. ఆది, శ్రీను, చైతూల పాత్రల‌ని ప‌రిచ‌యం చేస్తూ క‌థ‌లోకి తీసుకెళ్లిన ద‌ర్శకుడు.. మంచి ఫ‌న్ కూడా ఉండేలా స‌న్నివేశాల్ని రాసుకున్నాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ పాత్ర‌, ప్రియ‌ద‌ర్శి ల‌వ్ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. అమ్మ ప్రేమ‌ని పొంద‌డం కోసం ప‌రిత‌పించే ఆది చుట్టూ సాగే ఆ స‌న్నివేశాలు హృద‌యాల్ని బ‌రువెక్కిస్తాయి. గ‌తంలోకి వెళ్లి త‌న అమ్మానాన్నలు, ఇల్లుని చూసుకోవ‌డం, అమ్మ చేతి వంట రుచి చూడటం వంటి స‌న్నివేశాలు మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి. క‌థ‌లో విధి అంశాన్ని స్పృశించిన తీరు కూడా బాగుంది. అమ‌ల – శ‌ర్వానంద్ త‌మ న‌ట‌న‌తో క‌ట్టిప‌డేశారు. వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీళ్ల బాల్యాన్ని గుర్తు చేసే పాత్రల్లో నటించిన చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. రీతూవ‌ర్మ పాత్ర‌, ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది.

టెక్నికల్ గా : సినిమా టెక్నికల్ గా కూడా బాగుంది. సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు జేక్స్ బిజోయ్‌. సుజీత్ సారంగ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శకుడు శ్రీకార్తిక్‌ క‌థ‌ని తెరపైకి తీసుకొచ్చిన విధానంలోనూ ఓ ప్రత్యేక‌త క‌నిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • క‌థ‌ – క‌థ‌నం
  • శర్వానంద్, అమల, వెన్నెల కిషోర్ ల నటన
  • ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

  • అక్కడ‌క్కడా స్లో గా సాగడం

చివరగా : ఒకే ఒక్క జీవితం.. కమ్మనైనా సినిమా

రేటింగ్ : 3.5/5