చారిత్రక క్షణాలు ఫ్యాషన్‌కు పిలుపునిస్తాయి

చారిత్రక క్షణాలు ఫ్యాషన్‌కు పిలుపునిస్తాయి అన్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. ఆదివారం సాయంత్రం విండ్సర్‌ ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సోనమ్‌ కామన్వెల్త్‌ గురించి పరిచయం చేసింది. ఆమె ‘నమస్తే’ అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు స్టీవ్‌ విన్‌వుడ్‌తో కలిసి 56 కామన్వెల్త్‌ దేశాలకు చెందిన గాయక బృందాలను పరిచయం చేసింది. ఆమె తన భర్త ఆనంద్‌ అహుజా, తన స్నేహితులు ఇమ్రాన్ అమెద్, మన్సతాతో కలిసి ఈ వేడుకలకు హాజరైంది.

ఈ వేడుకలో సోనమ్‌.. భారత్‌, లండన్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్‌ అనామిక ఖన్నా, ఎమిలియా విక్‌స్టెడ్ కలిసి ప్రత్యేకంగా రూపొందించిన గౌనును ధరించింది. 18వ శతాబ్దానికి చెందిన కాలికో అనే ప్రింట్‌ను ఈ గౌనుపై చిత్రించారు. వేడుక అనంతరం సోనమ్‌ అక్కడి విశేషాలను ఇన్‌స్ర్టాగ్రాం వేదికగా పంచుకుంది. ‘చారిత్రక క్షణాలు ఫ్యాషన్‌కు పిలుపునిస్తాయి. ఈ దుస్తులను వేడుకల్లో ధరించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇది నాకు మరుపురాని క్షణం’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది.