కేసీ వేణుగోపాల్ ను కలిసిన సీఎం రేవంత్

రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సీఎం అభ్యర్థిగా ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. హైకమాండ్ నేతలను ఒక్కొక్కరిగా కలుస్తున్నారు. ఈ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో పాటుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా రేవంత్ కలుస్తారని తెలుస్తోంది. తనని  ముఖ్యమంత్రిగా చేసేందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. రేపు ఎల్బీ స్టేడియంలో జరగనున్న తన ప్రమాణస్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించబోతున్నారు. 

మరోవైపు మంత్రివర్గ కూర్పు పైనా హైకమాండ్ తో రేవంత్ చర్చలు జరుపబోతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరికి సీతక్క, పొన్నం ప్రభాకర్ లకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక లెక్కల ప్రకారం.. అన్ని ఉపకులాల చెందిన నేతలను మంత్రివర్గంలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి.. గతం కంటే భిన్నంగా కాంగ్రెస్ పాలన ఉండబోతుంది. వైఎస్ ఆర్ పాలనను గుర్తు చేసేలా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.