యాదాద్రి : శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. గత వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నేటితో పూర్తయింది. అనంతరం బంగారు కవచ మూర్తులతో బాలాలయం నుంచి ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.

ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. శోభాయాత్ర పూర్తయిన తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేపట్టనున్నారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు.

మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం కానుంది. అనంతరం 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది.  సీఎం కేసీఆర్‌ దంపతులు తొలిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.